ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రవేశ పరీక్షలు లేకుండానే డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ
ఏపి క్రీడల పాలసీ 2024 – 29 ప్రకారం ప్రతిభ గల క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గుర్తించిన క్రీడలలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఉప జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో రాత పరీక్ష లేకుండా డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ ఆదేశాలు 5 సం.లు లేదా తదుపరి క్రీడల పాలసీ వచ్చే వరకు అమలులో ఉంటాయి.
ఇవీ మార్గదర్శకాలు..
▪️ ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఇతర శాఖల నోటిఫికేషన్లు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన మెరిట్ జాబితా ఆధారంగా.. 3 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఉద్యోగాలు ఇస్తారు.
▪️పోటీ పరీక్షలు లేకుండా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు సంబంధిత శాఖ స్పోర్ట్స్ అథారిటీకి (SAAP) తెలియజేయాలి.
▪️ డిపార్ట్మెంట్ 100 పోస్టులు ఖాళీలు నోటిఫై చేస్తే.. అందులో 3 శాతం అంటే 3 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో రిసర్వ్ చేయాలి.
▪️అభ్యర్థి స్పోర్ట్స్ కోటాలో ఎంపిక అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ గానే పరిగణిస్తారు. అభ్యర్థి కులం ఎస్సీ/ఎస్టీ/బిసి/ews కోటాలో లెక్కించడానికి వీలు లేదు.
▪️సంబంధిత డిపార్ట్‌మెంట్ నుండి ఇండెంట్‌లు అందిన తర్వాత, అర్హులైన క్రీడాకారుల కోసం కేటాయించిన ఖాళీలను భర్తీ చేయడానికి, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (VC & MD SAAP) దరఖాస్తుల కోసం రాష్ట్రంలోని ప్రముఖ వార్తాపత్రికలలో పబ్లిక్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. పోస్టుల వివరాలు, అర్హతలు మరియు ఇతర నిబంధనలు మరియు షరతులు పేర్కొన్న నోటిఫికేషన్‌లో పేర్కొనబడతాయి.
▪️స్పోర్ట్స్ అధారిటీ (SAAP) ద్వారా స్వీకరించిన దరఖాస్తులు స్క్రీనింగ్ కమిటీ ద్వారా స్క్రూటినీ చేసి తుది జాబితా రూపొందిస్తారు. స్క్రీనింగ్ కమిటీ రూపొందించినదే ఫైనల్ గా పరిగణిస్తారు.